: తమిళ తంబికి రహానే చెబితే తెలిసింది!
బ్రిస్బేన్ టెస్టు తొలి రోజు ఆటలో టీమిండియా ఓపెనర్ విజయ్ చేసిన సెంచరీ హైలైట్. కొత్త బంతితో ఆసీస్ పేసర్లు నిప్పులు చెరిగినా ఓపిగ్గా కాచుకున్న, విజయ్ మొత్తమ్మీద మూడంకెల స్కోరుతో మురిపించాడు. అయితే, సెంచరీ పూర్తయిన విషయం అతడికి తెలియదట. రహానే చెబితేనే తెలిసింది. షేన్ వాట్సన్ విసిరిన బంతిని కవర్ డ్రైవ్ ద్వారా బౌండరీకి పంపిన విజయ్ 100 పరుగుల మార్కు చేరుకున్నాడు. సాధారణంగా సెంచరీ పూర్తయిన పిమ్మట బ్యాట్స్ మెన్ ప్రేక్షకులకు, సహచరులకు బ్యాట్ పైకెత్తి అభివాదం చేస్తారు. సెంచరీ చేసిన విషయం తెలియని విజయ్ మామూలుగా ఉండిపోయాడు. రహానే చెప్పడంతో బ్యాట్ పైకెత్తాడు. దీనిపై ఈ తమిళ తంబి మాట్లాడుతూ, "వాస్తవానికి నా స్కోరు ఎంతో తెలియదు. జట్టు స్కోరుపైనే దృష్టి పెట్టాను. నాన్ స్ట్రయికింగ్ ఎండ్ లో ఉన్న అజింక్యా చెబితేనే తెలిసింది శతకం సాధించానని. గత మ్యాచ్ లో 99 పరుగుల వద్ద అవుటవడంతో వ్యక్తిగత స్కోరును పట్టించుకోలేదు" అని వివరించాడు. ఇక, ఆస్ట్రేలియాపై ఆడడాన్ని ఎల్లప్పుడూ ఆస్వాదిస్తానని చెప్పాడు. అత్యుత్తమ జట్టుపై పరుగులు చేయడం ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందని అభిప్రాయపడ్డాడు.