: ఇందూరు అబ్బాయితో చైనా అమ్మాయి పెళ్లి


ప్రేమకు ఎల్లలు లేవన్న విషయం మరోమారు రుజువైంది. నిజామాబాద్ జిల్లా ఇందూరుకు చెందిన అబ్బాయితో చైనా అమ్మాయి పెళ్లి బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది. నిజామాబాద్ శివారులోని శ్రీభారతి గార్డెన్స్ లో జరిగిన ఈ పెళ్లితో ఏకమైన వంశీకృష్ణ, మింగ్ లాంగ్ లు చైనా వెళ్లిన తర్వాత అక్కడి సంప్రదాయాల ప్రకారం మరోమారు పెళ్లాడనున్నారు. వివరాల్లోకి వెళితే... ఇందూరుకు చెందిన పీడబ్ల్యూడీ ఉద్యోగి గంగాధర్ కుటుంబం నిజామాబాద్ లోని గాజుల్ పేటలో స్థిరపడింది. గంగాధర్ కొడుకు వంశీ ఇంటర్ తర్వాత చైనాలో ఎంబీబీఎస్ చేశాడు. ఆ తర్వాత సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా మారాడు. ఈ క్రమంలో చైనా నగరం షాంఘైలోని 3జీ నెట్ వర్క్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీ లిమిటెడ్ సీఈఓగా పనిచేస్తున్నాడు. అదే కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ)గా కొనసాగుతున్న మింగ్ లాంగ్ తో వంశీకి ఏర్పడ్డ పరిచయం కొద్దిరోజుల్లోనే ప్రేమగా మారింది. విషయం తెలుసుకున్న ఇరు కుటుంబాలు వారి పెళ్లికి అంగీకారం తెలిపారు. ఇంకేముంది, భారతి గార్డెన్ లో హిందు సంప్రదాయం ప్రకారం మింగ్ లాంగ్ మెడలో వంశీ తాళి కట్టాడు. ఈ వివాహ వేడుకకు వంశీ బంధువర్గంతో పాటు మింగ్ లాంగ్ కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు.

  • Loading...

More Telugu News