: నిలిచిపోయిన స్పైస్ జెట్ సర్వీసులు
అనుకున్నదే జరిగింది. తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన స్పైస్ జెట్ విమానయాన సంస్థ సేవలు నేటి ఉదయం నుంచి నిలిచిపోయాయి. బకాయిలు చెల్లించని కారణంగా స్పైస్ జెట్ విమానాలకు అవసరమైన ఇంధనాన్ని సరఫరా చేసేందుకు చమురు విక్రయ సంస్థలు నిరాకరించిన నేపథ్యంలో, సర్వీసులు నిలిపివేయక తప్పలేదని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి. బకాయిలు భారీగా పెరిగిపోవడంతో, ఇకపై అరువుగా ఇంధనాన్ని అందించలేమని, స్పైస్ జెట్ కు ఇంధనం విషయంలో క్యాష్ అండ్ క్యారీ పద్ధతినే అవలంబించనున్నట్లు చమురు సంస్థలు తేల్చిచెప్పాయి. రూ.2 వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిన తమకు ప్రభుత్వం నుంచి సహాయం అందకపోతే, రోజువారీ నిర్వహణ కూడా కష్టమని మంగళవారం కేంద్రం పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రిని స్పైస్ జెట్ శరణువేడిన సంగతి తెలిసిందే. అయితే, తక్షణ సాయంపై ఎలాంటి హామీ ఇవ్వని మంత్రి, ప్రధానమంత్రి కార్యాలయాన్ని సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ క్రమంలో బుధవారం ఇంధనం లభ్యత లేకపోవడంతో స్పైస్ జెట్ సర్వీసులన్నీ నిలిచిపోయాయి.