: హైదరాబాదీలను నిండా ముంచిన మరో ‘మెహతా’


బాంబే స్టాక్ ఎక్సేంజిలో మరో ఘరానా మోసం వెలుగు చూసింది. గతంలో ఇన్వెస్టర్లను ముంచిన హర్షద్ మెహతా తరహాలోనే నిర్మల్ కోటేజా అనే వ్యక్తి చేసిన ఈ మోసంలో బాధితులు హైదరాబాదీలు. అయితే, దాదాపు రూ.240 కోట్లు పోగొట్టుకున్న హైదరాబాదీలపైనే సెబీ నిషేధం విధించడం గమనార్హం. ముందూ, వెనుకా చూడకుండా తమపై నిషేధం విధించడం సరికాదంటూ తాజాగా హైదరాబాదుకు చెందిన ట్రాన్స్ జీన్ బయోటెక్ టెక్నాలజీస్ ఎండీ కోటేశ్వరరావు సెబీకి లేఖ రాశారు. నిధుల సమీకరణ కోసం యత్నిస్తున్న ట్రాన్స్ జీన్ యాజమాన్యాన్ని బుట్టలో వేసుకున్న నిర్మల్ కోటేజా, ఎంచక్కా తన పని చేసుకుపోయాడు. వివిధ ప్రాంతాల్లో తనకు అనుకూలమైన వ్యక్తులను మధ్యవర్తులుగా నియమించుకున్న కోటేజా, ట్రాన్స్ జీన్ సేకరించిన రూ.240 కోట్ల నిధులతో పాటు కోటేశ్వరరావు నేతృత్వంలోని ఇతర కంపెనీల ఖాతాల నుంచి కూడా డబ్బును లూటీ చేశాడు. సేకరించిన నిధులు బ్యాంకు ఖాతాలో నిక్షేపంగా ఉన్నాయని చెబుతూ వచ్చిన కోటేజా అనుచరులు ఎలాంటి ఆటంకం లేకుండానే తమ పని కానిచ్చేశారు. కోటేజా వంచనపై పూర్తి స్థాయిలో అవగాహనకు వచ్చిన కోటేశ్వరరావు తాజాగా సెబీకి లేఖ రాయడంతో పాటు హైదరాబాదులోని కోర్టును ఆశ్రయించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే, మోసం బయటపడగానే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి కోటేశ్వరరావు ఆధారాలతో ఫిర్యాదు చేశారు.

  • Loading...

More Telugu News