: ఎమ్మెల్యే పదవికి తలసాని రాజీనామా?
కేసీఆర్ మంత్రివర్గంలో చేరనున్న సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసయాదవ్ తన శాసనసభ్యత్వానికి నేడు రాజీనామా చేయనున్నారన్న వార్తలు జోరందుకున్నాయి. గడచిన ఎన్నికల్లో టీడీపీ టికెట్ పై సనత్ నగర్ అసెంబ్లీ నుంచి పోటీ చేసిన ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ఎన్నికల అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన టీడీపీకి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ లో చేరిపోయారు. ఈ నేపథ్యంలో తలసాని తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేయాలని టీ టీడీపీ పలుమార్లు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మంత్రివర్గంలో చేరనున్న తలసాని, టీడీపీ టికెట్ తో అందివచ్చిన శాసనసభ్యత్వాన్ని త్యజించేందుకే మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. నేటి ఉదయం 8.30 గంటలకు ఆయన విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశంలో తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది.