: సాక్షి ముద్రణ కార్యాలయాలను జప్తు చేసిన ఈడీ
సాక్షి దినపత్రిక ముద్రణ జరిగే కార్యాలయాలను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. జగతి పబ్లికేషన్స్ కింద ప్రచురితమవుతున్న సాక్షి దినపత్రిక జనని ఇన్ ఫ్రా నేతృత్వంలోని భవనాల్లో ముద్రితమవుతోంది. సాక్షి దినప్రతిక ముద్రణ కోసం రాష్ట్రంలోని పలు జిల్లా కేంద్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లోనూ జనని ఇన్ ఫ్రా భవనాలను ఏర్పాటు చేసింది. ఈడీ నేడు జప్తు చేసిన ఆస్తుల్లో జనని ఇన్ ఫ్రాకు చెందిన రూ.16.56 కోట్ల విలువ చేసే ఆస్తులున్నాయి. ఈ ఆస్తుల్లో భవనాలతో పాటు భూములు కూడా ఉండటం గమనార్హం. పెన్నా సిమెంట్స్ కేసులో రూ.68 కోట్లను జగన్ తీసుకున్నారన్న ఆరోపణలకు సంబంధించిన కేసులో ఈడీ నేడు తాజా జప్తునకు సంబంధించిన తీర్పు చెప్పింది. జప్తునకు గురైన కార్యాలయాల్లో కర్నూలు, ఒంగోలు, నెల్లూరు, కరీంనగర్, నల్లగొండ, వరంగల్, తిరుపతి, ఖమ్మం, మహబూబ్ నగర్, నిజామాబాద్, విజయవాడ, మంగళగిరి, హైాదరాబాద్ పరిధిలోని నాచారం, బాలానగర్ తదితర ప్రాంతాల్లోని సాక్షి ముద్రణ కార్యాలయాలున్నాయి. మరోవైపు జగతి పబ్లికేషన్స్ కు చెందిన రూ.5.59 కోట్ల విలువైన యంత్ర సామగ్రిని కూడా ఈడీ జప్తు చేసింది.