: మార్టిన్ కేఫ్ ఉదంతంలో ఉగ్రవాదులు ఇద్దరు... బందీలు 30 మంది!
ఆస్ట్రేలియాలో ఉగ్రవాదుల ఘాతుకంపై మరింత సమాచారం తెలిసింది. విశ్వకాంత్ అంకిరెడ్డి తండ్రి ఈశ్వర్ రెడ్డి ఓ టీవీ ఛానెల్ తో మాట్లాడుతూ సమగ్ర వివరాలు అందజేశారు. అక్కడి స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10 గంటల సమయంలో కేఫ్ లోకి చొరబడ్డ ఇద్దరు తీవ్రవాదులు 35 మందిని బందీలుగా పట్టుకున్నారు. వీరిలో ఓ ఐదుగురు బందీలు చాకచక్యంగా తలుపు తెరుచుకుని సురక్షితంగా బయటపడగలిగారు. ఇంకా 30 మంది ఉగ్రవాదుల చెరలో బందీలుగా ఉన్నారు. ఇన్ఫోసిస్ ఉద్యోగిగా ఆరేళ్ల క్రితం ఆస్ట్రేలియా వెళ్లిన విశ్వకాంత్ తొలుత మెల్ బోర్న్ లోని ఓ బ్యాంకులో ఉద్యోగం చేశారు. గత డిసెంబర్ లో ఆయన సిడ్నీకి మారారు. ఐదేళ్లకు పైగా అక్కడే ఉంటున్న విశ్వకాంత్ కు ఆస్ట్రేలియా పౌరసత్వం లభించింది. ఇక ఉగ్రవాదుల ఘాతుకం నేపథ్యంలో విశ్వకాంత్ భార్యతో ఆస్ట్రేలియా పోలీసులు మాట్లాడారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, 24 గంటల్లోగా ఉగ్రవాదుల చెర నుంచి విశ్వకాంత్ సహా బందీలందరినీ విడిపిస్తామని ఈ సందర్భంగా పోలీసులు ఆమెకు భరోసా ఇచ్చారు. విశ్వకాంత్ భార్యతో ఈశ్వర్ రెడ్డి ఫోన్ లో సంభాషిస్తూ పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ఆస్ట్రేలియా పౌరసత్వం వచ్చిన దరిమిలా ఆ దేశ పోలీసులు, విశ్వకాంత్ పై మరింత శ్రద్ధ పెట్టినట్లు తన కోడలు చెప్పిందని ఈశ్వర్ రెడ్డి తెలిపారు. ఉగ్రవాదుల బందీల్లో ఆస్ట్రేలియా పౌరులు సహా వివిధ దేశాలకు చెందిన వారూ ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.