: క్రిస్ మస్ సెలవు రద్దుపై రాజ్యసభలో రగడ... అదేమీ లేదన్న కేంద్రం
సుపరిపాలన దినోత్సవమంటూ ఈ నెల 25న క్రిస్ మస్ సెలవు రద్దు విషయంపై నేడు రాజ్యసభ దద్దరిల్లింది. అటల్ బిహారీ వాజ్ పేయి, మదన్ మోహన్ మాలవీయల జన్మదినాలను పురస్కరించుకుని ఈ నెల 25న సుపరిపాలన దినాన్ని పాటించాలని ప్రదాని నరేంద్ర మోదీ శనివారం పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నవోదయ విద్యాలయాలతో పాటు సీబీఎస్ఈ పాఠశాలలకు సెలవును కేంద్రం రద్దు చేస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో నేటి రాజ్యసభ సమావేశాల్లో భాగంగా దీనిపై సీపీఎం సభ్యుడు సీతారాం ఏచూరి ఆందోళన వ్యక్తం చేశారు. మిగిలిన విపక్ష పార్టీల సభ్యులు కూడా ఏచూరికి మద్దతు తెలిపారు. దీంతో సభకు సమాధానమిచ్చిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, సెలవు రద్దు యోచన లేదన్నారు. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ తన ద్వారా సభకు సందేశాన్ని పంపారని ఆయన వెల్లడించారు. సుపరిపాలనపై కేవలం వ్యాస రచన పోటీని మాత్రం నిర్వహస్తామని జైట్లీ చెప్పారు.