: తిరుపతికి ఏపీ సీఎం చంద్రబాబు
తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ ఆకస్మిక మరణం నేపథ్యంలో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నేడు తిరుపతికి వెళ్లనున్నారు. వాస్తవానికి నేడు ప్రకాశం జిల్లాలో చంద్రబాబు పర్యటించాల్సి ఉంది. ఆ పర్యటన ముగిసిన తర్వాత ఆయన నేరుగా తిరిగి హైదరాబాద్ చేరుకోవాల్సి ఉంది. అయితే వెంకటరమణ మరణం నేపథ్యంలో చంద్రబాబు నేటి షెడ్యూల్ లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. చెన్నైలో మరణించిన వెంకటరమణ మృతదేహం తిరుపతికి చేరుకునే సరికి కొంత సమయం పట్టనుంది. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా పర్యటనను యథాతథంగా కొనసాగించనున్న చంద్రబాబు ఆ తర్వాత హైదరాబాద్ కు కాకుండా తిరుపతికి వెళ్లనున్నారు. తిరుపతిలో వెంకటరమణ భౌతిక కాయానికి నివాళులర్పించిన తర్వాత ఆయన హైదరాబాద్ బయలుదేరతారు.