: కేజ్రీవాల్ ప్రకటనలను ప్రసారం చేయొద్దు: ఎఫ్ఎం రేడియోలకు ఢిల్లీ పోలీసుల ఆదేశం
చేతికందిన అధికారాన్ని నేలపాలు చేసి, ఢిల్లీ ప్రజల ఆశలను అడియాశలు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ పోలీసులు షాకిచ్చారు. ఆప్ జారీ చేసిన ఎన్నికల ప్రకటనను నిలిపివేయాలని ఢిల్లీ పోలీసులు అన్ని ఎఫ్ఎం రేడియో ఛానెళ్లకు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల ఖర్చుల కోసం చందాల వసూళ్లలో బిజీబిజీగా గడుపుతున్న కేజ్రీవాల్ కు ఢిల్లీ పోలీసుల చర్య శరాఘాతం లాంటిదే. ఢిల్లీ ఎన్నికల్లో తమ ప్రత్యర్థి నరేంద్ర మోదీ కాదని పోస్టర్లు తయారు చేయించిన ఆయన బీజేపీ ఆగ్రహానికి గురయ్యారు. తాజాగా ఆకతాయిల వేధింపులు తాళలేక ఓ బాలిక ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు స్వీకరించకపోవడంతో ఆ బాలికకు తాము అండగా నిలుస్తున్నట్లు అర్థం వచ్చేలా ఆ పార్టీ ఓ యాడ్ ను ఎఫ్ఎం రేడియోలకు ఇచ్చింది. దీనిపై ఢిల్లీ పోలీసులు భగ్గుమన్నారు. అసలు ఆ ప్రకటనలో ఉన్న బాలిక నిజమైన బాధితురాలేనా? అని ప్రశ్నించిన పోలీసులు, ఇకపై ఆప్ ప్రకటనలను ప్రసారం చేసే ముందు తమను సంప్రదించాలని ఎఫ్ఎం రేడియో ఛానెళ్లకు ఆదేశాలు జారీ చేశారు.