: పాక్ స్పిన్నర్లపై వేటుకు భారతే కారణమట!
నిబంధనలకు విరుద్ధంగా బౌలింగ్ యాక్షన్ ఉందన్న కారణంతో పాకిస్థాన్ స్పిన్నర్లు సయీద్ అజ్మల్, మహ్మద్ హఫీజ్ లపై ఐసీసీ సస్పెన్షన్ వేటు వేయడం తెలిసిందే. అయితే, వారిద్దరిపై వేటుకు భారతే కారణమంటున్నారు పీసీబీ మాజీ చీఫ్ జకా అష్రాఫ్. వరల్డ్ కప్ లో వారిద్దరినీ ఆడనీయకుండా భారత్ కుట్ర పన్నిందని ఆరోపించారు. అంతేగాకుండా, బయోమెకానిక్స్ టెస్టుకు అజ్మల్, హఫీజ్ లను చెన్నై పంపింనందువల్ల ఉపయోగం ఉండదని అన్నారు. ఈ పరీక్షలకు వారిని ఆస్ట్రేలియా పంపాలన్నది తన అభిప్రాయమన్నారు. క్రికెటర్లను పరీక్షల నిమిత్తం భారత్ కు పంపడమంటే... ఆకలిగొన్న సింహం గుహలోకి ఎవరో ఒకరిని పంపి, ఏ హాని జరగకుండా బయటకు వస్తారని ఆశించడమే అవుతుందని వ్యాఖ్యానించారు. పనిలోపనిగా, ఈ కుట్రలో ఇంగ్లండ్ కూడా భారత్ తో చేతులు కలిపిందని ఆరోపించారు. తాను పీసీబీ చీఫ్ గా వ్యవహరించిన కాలంలో అజ్మల్ కు ఇంగ్లీష్ కౌంటీల నుంచి ఎన్నో ఆఫర్లు వచ్చాయని, అయితే, వారు కుట్రలకు పాల్పడతారన్న ఉద్దేశంతో తాను అతడిని ఆపేశానని అష్రాఫ్ తెలిపారు.