: ఐఫోన్లు ఆర్డర్ చేస్తే చెక్క ముక్కలు వచ్చాయి!
ఇటీవల ఆన్ లైన్ పోర్టళ్ల ద్వారా కొనుగోలు చేస్తున్న వస్తువుల స్థానంలో రాళ్లు, చెక్కముక్కలు డెలివరీ అవుతున్న ఘటనలు అధికమవుతున్నాయి. తాజాగా, పూణేకు చెందిన దర్శన్ కాబ్రా అనే వ్యక్తి 'స్నాప్ డీల్'లో రెండు ఐఫోన్లు (ఐఫోన్ 4ఎస్) బుక్ చేశాడు. బుక్ చేసిన కొన్ని రోజుల తర్వాత అతని చిరునామాకు ఓ ప్యాక్ వచ్చింది. ఎంతో ఆత్రుతతో విప్పిచూసిన కాబ్రా షాక్ తిన్నాడు. ఎందుకంటే, అందులో ఐఫోన్లు లేవు, చెక్క ముక్కలున్నాయి. అప్పటికి ఆ ప్యాక్ తీసుకొచ్చిన డెలివరీ బాయ్ ఇంకా అక్కడే ఉన్నాడు. ఈ విషయంలో కాబ్రాను అదృష్ణవంతుడనుకోవాలి. క్యాష్ ఆన్ డెలివరీ విధానంలో ఐఫోన్లును బుక్ చేశాడు. అంటే, సరుకు అందుకున్న తర్వాత నగదు చెల్లించాల్సి ఉంటుంది. ఆర్డర్ ప్రకారం, రెండు ఫోన్లకు కలిపి కాబ్రా రూ.40,508 చెల్లించాలి. ఫోన్లకు బదులు చెక్కముక్కలు రావడంతో, తాను నగదు చెల్లించనని స్నాప్ డీల్ డెలివరీ బాయ్ కి స్పష్టం చేశాడీ పూణే వాసి. దీనిపై కాబ్రా మాట్లాడుతూ, క్యాష్ ఆన్ డెలివరీ విధానంలో బుక్ చేయడంతో బతికిపోయానని అన్నాడు.