: ఏపీలో పశువులకు వసతి గృహాలు
ఏపీలో జనవరి లోపు ప్రతి గ్రామంలోనూ పశువులకు వసతి గృహాలు ఏర్పాటు చేస్తామని మంత్రి పత్తిపాటి పుల్లారావు తెలిపారు. గుంటూరులో జరిగిన గ్రంథాలయ ఉద్యోగుల రాష్ట్ర సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, భవిష్యత్ ప్రణాళికలను వివరించారు. రైతు రుణ విముక్తిలో సాంకేతిక లోపాలను సవరిస్తున్నామని చెప్పారు. అర్హులైన వారందరికీ ఖాతాలో మాఫీ సొమ్ము జమ చేస్తామని స్పష్టం చేశారు. దీనిపై వివరాలు తెలుసుకునేందుకు మూడు టోల్ ఫ్రీ నెంబర్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరో మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ, వచ్చే విద్యా సంవత్సరానికి అన్ని పాఠశాలల్లో టాయిలెట్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. సోమవారం విజయవాడలో విద్యాశాఖ అధికారులతో కీలక సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ భేటీలో, విద్యారంగ సమస్యలు, అభివృద్ధిపై బ్లూప్రింట్ తయారుచేస్తామని వెల్లడించారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరుకు బయోమెట్రిక్ విధానం అమల్లోకి తెస్తామని గంటా పేర్కొన్నారు. అంతేగాకుండా, విద్యావ్యవస్థలో మార్పులకు త్వరలో నిపుణుల కమిటీ, వెబ్ సైట్ ఏర్పాటు చేయనున్నామని తెలిపారు.