: ఘర్షణలో స్నేహితుడిని కాల్చి చంపేశాడు
ముగ్గురు వ్యక్తుల మధ్య గొడవ చివరకు కాల్పులకు దారితీసింది. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలం గున్నంపల్లిలో జరిగింది. సఫారీ కారులో వచ్చిన ఈ ముగ్గురూ వైన్ షాప్ వద్ద మద్యం సేవిస్తుండగా... వీరి మధ్య ఘర్షణ తలెత్తింది. ఇంతలో ఓ వ్యక్తి తుపాకీ తీసి తన మిత్రుడిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. చనిపోయిన వ్యక్తిని తాడేపల్లిగూడెంకు చెందిన రౌడీషీటర్ పచ్చా మధుగా అనుమానిస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే కాల్పులు జరిపిన వ్యక్తి కారులో పరారయ్యాడు. అనంతరం అక్కడున్న వారంతా ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్లారు. వైన్ షాపులో ఉన్న వ్యక్తులు కూడా షాపును వదిలేసి వెళ్లిపోయారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.