: కోహ్లీ, విజయ్ పోరాటం వృధా... విజయంతో ఆసీస్ మాట నిలబెట్టుకుంది!
విజయంతో ఫిల్ హ్యూస్ కు ఘన నివాళి అర్పిస్తామని ప్రకటించిన ఆస్ట్రేలియా జట్టు అన్న మాటను నిలబెట్టుకుంది. అత్యంత నాటకీయ పరిణామాల మధ్య ఆస్ట్రేలియా, భారత్ తొలి టెస్టులో ఆసీస్ విజయం సాధించింది. 364 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్సింగ్స్ ఆరంభించిన టీమిండియా ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ మురళీ విజయ్ అత్యద్భుతమైన రీతిలో 99 పరుగులు సాధించగా, అతడికి జత కలిసిన కెప్టెన్ కోహ్లీ సెంచరీతో సత్తా చాటాడు. దీంతో అడిలైడ్ టెస్టులో టీమిండియా విజయం దిశగా పయనించింది. వీరిద్దరి భాగస్వామ్యంతో టీమిండియా విజయం నల్లేరు మీద నడకలా సాగింది. ఇంతలో మురళీ విజయ్ 99 పరుగుల వద్ద ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. తరువాత వచ్చిన రైనాను ఎల్బీడబ్ల్యూగా లియాన్ దొరకబుచ్చుకున్నాడు. రోహిత్ కూడా అతనికే దొరకేశాడు. సెంచరీ చేసి మంచి ఊపుమీదున్న కెప్టెన్ కోహ్లీ ఆడిన బంతి అనూహ్యంగా గాల్లోకి లేచింది... దానికి భారీ మూల్యం చెల్లించుకున్నాడు. దీంతో ఒకే టెస్టులో రెండు సెంచరీలు చేసినా ఫలితం లేకుండా పోయింది. అనంతరం ఆసీస్ విజయం లాంఛనమే అయింది. షమీ, ఆరోన్, ఇషాంత్ వీలైనంత తొందరగా వికెట్లిచ్చేసి తొలి టెస్టు విజయాన్ని ఆసీస్ కు కట్టబెట్టారు. దీంతో టీమిండియా 48 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.