: ఫేస్ బుక్ లో ఇక 'డిజ్ లైక్' బటన్ ఫీచర్!
ఫేస్ బుక్ లో త్వరలో 'డిజ్ లైక్' బటన్ అనే ఆప్షన్ మీరు చూడవచ్చు. మరికొద్ది రోజుల్లో ఈ ఫీచర్ ను తీసుకురానున్నట్టు ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకెర్ బర్గ్ తెలిపారు. అయితే, దీని కారణంగా వినియోగదారులకు ఇబ్బంది కలగచ్చేమోనని కూడా ఆలోచిస్తున్నట్టు చెప్పారు. ఇటీవల కాలంలో నకిలీ, వైరల్ పోస్టులు కుప్పలుతెప్పలుగా నెట్వర్క్ లో వచ్చిపడుతుండటంతో ఏది అసలో, ఏది నిజమో గుర్తించలేకపోతున్నారు. ఈ క్రమంలో ఖాతాదారుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు 'డిజ్ లైక్' బటన్ ఆప్షన్ ను పెట్టాలని నిర్ణయించుకున్నట్టు కాలిఫోర్నియాలోని ఎఫ్ బీ ప్రధాన కార్యాలయంలో జుకెర్ వివరించారు. ఈ బటన్ ను ఓ మంచి కోసం అవసరమయ్యే విధంగా తీసుకురావల్సి ఉందన్నారు. "బాధాకరమైన విషయాలకు 'లైక్' బటన్ ను ప్రెస్ చేయడాన్ని చాలామంది ఇబ్బందిగా భావిస్తున్నారు. అందుకే ఇది మంచిది కాదు అని చెప్పేందుకు సంస్థ ఓ మార్గం కనుగొనేందుకు ప్రయత్నిస్తోంది" అని జుకెర్ పేర్కొన్నారు.