: ఆత్మహత్యలు చేసుకున్న రైతులు 69 మందే... కాదు 400!: ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య వాదన
తెలంగాణలో రైతు ఆత్మహత్యల లెక్కల విషయంలో గందరగోళం నెలకొంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమ రాష్ట్రంలో కేవలం 69 మంది రైతులే ఆత్మహత్యకు పాల్పడ్డారంటూ కేంద్రానికి నివేదిక సమర్పించింది. దీనిపై స్వచ్ఛంద సంస్థలు, ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి కాకిలెక్కలు చెబుతోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు ఆత్మహత్యలపై స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మాట్లాడుతూ, 300 మందికి పైగా రైతులు అప్పుల బాధ భరించలేక తెలంగాణలో ఆత్మహత్యలకు పాల్పడ్డారని చెబుతున్నారు. కాగా, ప్రతిపక్షాలు మాత్రం తెలంగాణలో అప్పుల బాధ తాళలేక సుమారు 400 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. రైతుల ఆత్మహత్యలకు ప్రధాన కారణం వ్యవసాయ రుణాలే కాదని, పిల్లల పెళ్లిళ్లు, ఆరోగ్య రుణాలు కలగలిపి వారి ఆత్మహత్యలకు కారణమవుతున్నాయని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.