: రామోజీ ఫిల్మ్ సిటీలో కేసీఆర్... తెలంగాణ సీఎంకు రామోజీ సాదర స్వాగతం!
ప్రపంచానికే తలమానికంగా నిలిచిన రామోజీ ఫిల్మ్ సిటీపై రాష్ట్ర విభజనకు ముందు ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ పార్టీ కత్తులు దూసింది. అక్రమ పద్ధతుల్లో చేజిక్కించుకున్న భూములను స్వాధీనం చేసుకుంటామని తెలంగాణ ప్రభుత్వ పెద్దలు పలు సందర్భాల్లో ప్రకటనలు కూడా గుప్పించారు. అయితే ఆరు నెలలు తిరగకముందే ఏమైందో, ఏమో కానీ...శుక్రవారం సీఎం కేసీఆర్ స్వయంగా రామోజీ ఫిల్మ్ సిటీలో అడుగుపెట్టారు. తెలంగాణ సీఎం హోదాలో వచ్చిన ఆయనకు రామోజీ ఫిల్మ్ సిటీ అధినేత రామోజీరావు సాదర స్వాగతం పలికారు. ఫిల్మ్ సిటీ మొత్తం కలియదిరిగిన కేసీఆర్, రామోజీ అద్భత కళాఖండాన్ని పొగడ్తలతో ముంచెత్తారు. రాష్ట్రానికే కాక దేశానికే రామోజీ ఫిల్మ్ సిటీ తలమానికమని కీర్తించారు. ఫిల్మ్ సిటీలో కొనసాగుతున్న నిర్మాణాలు పూర్తయితే, రాష్ట్రానికి మరింత ఖ్యాతి వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే, సీఎం కేసీఆర్ ఫిల్మ్ సిటీలో పర్యటించినంత సేపు రామోజీరావు కూడా ఆయన వెన్నంటే ఉన్నారు.