: ఎన్సీపీ కీలక నేతలపై దర్యాప్తునకు ఫడ్నవీస్ గ్రీన్ సిగ్నల్
అనుకున్నంతా అయ్యింది. బీజేపీ అధికారంలోకి వస్తే, ఎన్సీపీ నేతల అవినీతి వ్యవహారంపై దర్యాప్తు తప్పదన్న విశ్లేషకుల వాదనను నిజం చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కీలక నేతలు అజిత్ పవార్, ఛగన్ భుజబల్, సునీల్ తత్కారేలపై వెల్లువెత్తిన అవినీతి ఆరోపణలపై విచారణ జరిపేందుకు ఆ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖకు అనుమతి ఇస్తూ దేవేంద్ర ఫడ్నవీస్ సర్కారు నిర్ణయం తీసుకుంది. దీంతో మొన్నటిదాకా డిప్యూటీ సీఎంగా పనిచేసిన అజిత్ పవార్ ఏసీబీ విచారణకు హాజరుకావాల్సి ఉంది. మొన్నటి ఎన్నికల సందర్భంగా దేవేంద్ర ఫడ్నవీస్ సర్కారుకు మద్దతు విషయంలో శివసేన దోబూచులాట నేపథ్యంలో బీజేపీ దరికి చేరిన ఎన్సీపీకి అవినీతి కేసుల నుంచి దాదాపు ఊరట లభించదనే చెప్పాలి. అయితే ఇటీవలే శివసేన మళ్లీ తన పంథా మార్చుకోవడం, బీజేపీ సర్కారులో చేరడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. బీజేపీ సర్కారు... సంకీర్ణ ప్రభుత్వంగా ఏర్పడి వారం తిరగకముందే ఎన్సీపీ కీలక నేతలపై విచారణకు రంగం సిద్ధం కావడం చూస్తుంటే, మున్ముందు శరద్ పవార్ పార్టీ విపత్కర పరిస్థితులు ఎదుర్కోక తప్పదేమో.