: మోడీ అభ్యర్థిత్వంపై పెదవి విరిచిన మాయ
బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ఇంకా తన పేరును ప్రకటించకముందే గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ ప్రతిరోజూ వార్తల్లో వ్యక్తిలా నిలుస్తున్నారు. మొన్న జేడీ (యూ) నేత నితీశ్ కుమార్.. మోడీ అభ్యర్థిత్వాన్ని తాము అంగీకరించబోమని కరాఖండీగా చెప్పగా.. నిన్న, తక్షణమే బీజేపీ తన ప్రధాని అభ్యర్థి పేరును ప్రకటించాలని శివసేన డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మోడీపై బీఎస్పీ అధినేత్రి మాయావతి గళమెత్తారు. అబ్బే.. మోడీ అభ్యర్థిత్వంతో బీజేపీకి ఒరిగేదేమీలేదని పెదవి విరిచారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో 'ప్రధాని అభ్యర్థి మోడీ' అన్న నినాదంతో ముందుకెళితే బొక్కబోర్లా పడడం ఖాయమని కూడా ఈ మాజీ ముఖ్యమంత్రి జోస్యం చెప్పారు.
కాగా, 2014 ఎన్నికల కోసం మాయావతి తన పార్టీ తరుపున 36 మంది అభ్యర్థుల జాబితాను నేడు ప్రకటించారు. వారిలో 18 మంది బ్రాహ్మణులు కావడం విశేషం. ఆ ఎన్నికల్లో ఫలితాలు అందర్నీ ఆశ్చర్యపరచడం ఖాయమని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.