: ఇక గోదావరి ప్రక్షాళన తప్పదేమో!
కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ గంగ ప్రక్షాళనకు నడుం బిగించింది. ఇక తెలుగు రాష్ట్రాల పరిధిలోని గోదావరి జలాల ప్రక్షాళన తప్పదన్న వాదన బలపడుతోంది. లెక్కలేనన్ని పరిశ్రమలు తమ వ్యర్థాలను గోదావరి జలాల్లోకి వదులుతున్న నేపథ్యంలో గోదావరి జలాలు పూర్తిగా కలుషితమయ్యాయని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు చెబుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని గోదావరి జలాల పరిస్థితి మరింత విషమంగా ఉన్నట్లు వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ జిల్లాల పరిధిలోని గోదావరి ప్రవాహం మురికి కాలువను తలపిస్తోంది. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కలుషిత జలాల్లో స్నానమాచరిస్తే, రోగాల బారిన పడకతప్పదని కూడా వారు హెచ్చరిస్తున్నారు. గోదావరి జలాల ప్రక్షాళనకు దిగకపోతే, భవిష్యత్తులో పెనుముప్పు తప్పదన్న హెచ్చరికలనూ జారీ చేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రమో, లేక కేంద్రమో గోదావరి జలాల ప్రక్షాళనకు నడుం బిగించక తప్పదని వారు చెబుతున్నారు.