: అసెంబ్లీలో నృత్యాలు, ఫొటోలు చూస్తూ దొరికిపోయిన కర్ణాటక మంత్రి, నటుడు అంబరీష్
కర్నాటక గృహ నిర్మాణ శాఖ మంత్రి, ప్రముఖ సినీ నటుడు అంబరీష్ తాను చేసిన అసభ్య నృత్యాలు, ఫొటోలను అసెంబ్లీలో చూస్తూ అడ్డంగా దొరికిపోయారు. దీంతో విపక్ష బీజేపీకి కొత్త ఆయుధం దొరికినట్లయింది. మొన్న 'చౌహాన్ సెల్ పురాణం'తో అట్టుడికిన కర్నాటక ఉభయ సభలు తాజాగా అంబరీష్ ఉదంతంతో మరింత వేడెక్కాయి. తమ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటే, అంబరీష్‌పై కూడా తీసుకోవాలంటూ బీజేపీ డిమాండ్ చేయడం మొదలుపెట్టింది. శాసనసభ సమావేశాల్లో ఒక వైపు చర్చ జరుగుతుంటే, మరోవైపు తన పక్కన ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లికార్జునకు గతంలో తాను ఓ పబ్‌లో తాగిన మైకంలో ఉండి చేసిన నృత్యాన్ని సెల్‌ఫోన్‌లో చూపిస్తూ చౌహాన్ కాలం గడిపారు. ఈ వీడియో నిన్న ఉదయం వెలుగులోకి వచ్చింది. దీంతో సభ నినాదాలతో దద్దరిల్లింది. అధికార, ప్రతిపక్షానికి చెందిన నాయకులతో స్పీకర్ కాగోడు తిమ్మప్ప తన కార్యాలయంలో సమావేశమై, చేసిన సయోధ్య ప్రయత్నాలు ఫలించలేదు. ఎంత ప్రయత్నించినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో శాసనసభను వాయిదా వేస్తున్నట్టు ఆయన ప్రకటించారు.