: నేడు ప్రధానితో గవర్నర్ భేటీ... విభజన చట్టానికి సవరణ?
ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. రెండు రోజుల క్రితం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన గవర్నర్ గురువారమే ప్రధానిని కలవాల్సి ఉంది. అయితే పలు కారణాల వల్ల ఆయన నిన్న ప్రధానితో భేటీ కాలేకపోయారు. ఈరోజు ప్రధానితో భేటీ కానున్నట్లు గవర్నర్ నరసింహన్ నిన్న ప్రకటించారు. ఇదిలా ఉంటే, ఇప్పటికే కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ అయిన గవర్నర్ కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. గతంలోనూ పలు దఫాలుగా నరసింహన్ ఢిల్లీలో పర్యటించినా, ఈ దఫా పర్యటన అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. శ్రీశైలంలో తెలంగాణ విద్యుదుత్పత్తి, ప్రభుత్వ సంస్థల నిధుల పంపకం, విభజన, ఉద్యోగుల విభజన తదితరాలపై ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా కేంద్రం నేడు కీలక నిర్ణయం తీసుకోనుందని విశ్వసనీయ సమాచారం. ఈ కారణంగానే రెండు రోజుల క్రితం ఉన్నపళంగా ఢిల్లీ వచ్చేయాల్సిందిగా కేంద్ర హోంశాఖ గవర్నర్ ను కోరడంతో, మూడు రోజులుగా ఆయన అక్కడే మకాం వేశారని విశ్లేషకులు భావిస్తున్నారు. నేటి భేటీలో ప్రధాని మోదీ, గవర్నర్ తో అన్ని విషయాలను కూలంకషంగా చర్చించనున్నట్లు సమాచారం.