: ఇస్తాంబుల్ స్ఫూర్తిగా హైదరాబాద్


టర్కీ రాజధాని ఇస్తాంబుల్ స్ఫూర్తితో హైదరాబాద్ ను అంతర్జాతీయ నగరంగా మారుస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఆర్కిటెక్ట్ హఫీజ్ బృందంతో కేసీఆర్ సమీక్ష నిర్వహించిన అనంతరం మాట్లాడుతూ, చారిత్రిక ఆనవాళ్లు చెదరకుండా హైదరాబాద్ ను ఉన్నతంగా తీర్చిదిద్దుతామన్నారు. హైదరాబాదులో హుస్సేన్ సాగర్ చుట్టు ప్రక్కల ప్రతిష్ఠాత్మకంగా చేపట్టాల్సిన నిర్మాణాలు, అలాగే మూసీనది చుట్టుప్రక్కల చేపట్టనున్న నిర్మాణాలపై ఆయన చర్చించారు. వాటితో పాటు ఇందిరాపార్క్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో తెలంగాణ కళాభారతి పేరుతో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ ను ఏర్పాటు చేయనున్నామని ఆయన వెల్లడించారు. రవీంద్రభారతిని కూల్చేసి ఆ స్థానంలో మరో ప్రత్యేక కట్టడం నిర్మిస్తామని, అలాగే మూసీ నదికి రెండు వైపులా పార్క్ లు నిర్మిస్తామని ఆయన చెప్పారు. నిజాం కాలంలో హైదరాబాద్ లో అద్భుతమైన కట్టడాలు నిర్మించారని, ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ ను రియల్ ఎస్టేట్ వ్యాపార కేంద్రంగా మార్చేశారని ఆయన ఆరోపించారు. హైటెక్ సిటీ పేరుతో నిర్మించిన ఓ సిమెంట్ కట్టడాన్ని హైదరాబాద్ సింబల్ గా గత పాలకులు చూపించారంటూ కేసీఆర్, బాబును ఎద్దేవా చేశారు. హైదరాబాదులో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు మల్టీ లేయర్ ఫ్లై ఓవర్లు నిర్మిస్తామని ఆయన వెల్లడించారు. హైదరాబాదును అంతర్జాతీయ నగరంగా తీర్చి దిద్దేందుకు ఇస్తాంబుల్ ను స్ఫూర్తిగా తీసుకుంటామని కేసీఆర్ తెలిపారు. హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల కొత్తగా నిర్మించే టవర్ల ద్వారా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక ప్రగతి వృద్ధి చెందుతుందని ఆయన వివరించారు.

  • Loading...

More Telugu News