: టాపార్డర్ హిట్టు... లోయరార్డర్ లో పట్టు ఉందా?
టీమిండియా టాప్ ఆర్డర్ ఆసీస్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొని సత్తాచాటింది. ఆసీస్ బౌలర్లు ఫాస్ట్ పిచ్ లపై చెలరేగుతారని, టీమిండియా బ్యాట్స్ మన్ ను ముప్పతిప్పలు పెడతారని విశ్లేషకులు పర్యటనకు ముందు అభిప్రాయపడ్డారు. అంతా ఊహించినట్టే అడిలైడ్ పిచ్ పై ఆసీస్ బ్యాట్స్ మన్ స్వేఛ్ఛగా టీమిండియా బౌలర్లను ఆటాడుకున్నారు. భారత బౌలర్లలో ఎవరూ ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్ పై ఒత్తిడి తేలేకపోయారు. ఫలితంగా ఆస్ట్రేలియా జట్టు భారీ స్కోరు పిండుకుంది. అదే సమయంలో ఆసీస్ బౌలర్లు టీమిండియా టాపార్డర్ ను సమర్ధవంతంగా అడ్డుకున్నారు. ఓ మోస్తరు భాగస్వామ్యాలు నెలకొల్పగలిగిన స్టార్ ఆటగాళ్లు భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పలేకపోయారు. దీంతో టీమిండియా 5 వికెట్ల నష్టానికి 369 పరుగులు చేయగలిగింది. ఇప్పుడు కేవలం రోహిత్ శర్మ మాత్రమే చెప్పుకోదగ్గ బ్యాట్స్ మన్, కాగా మిగిలిని వారంతా ఆసీస్ గడ్డపై టెస్టులాడిన అనుభవం లేని వారే కావడం విశేషం. మరి అలాంటి లోయర్ ఆర్డర్ కనీసం 100 పరుగులు చేయగలుగుతుందా? అనేదే సగటు అభిమానిని వేధిస్తున్న ప్రశ్న. వృద్ధిమాన్ సాహా రంజీల్లో మంచి ఆటగాడిగా పేరున్నప్పటికీ టాప్ ఆర్డర్ ఓ మోస్తరుగా ఆడిన పిచ్ పై నాలుగోరోజు ఆట కొనసాగించగలడా? అనేది ఆసక్తి రేపుతోంది. ఇషాంత్ శర్మ బ్యాటింగ్ నైపుణ్యం అందరికీ తెలిసిందే కనుక అతనిపై ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. ఇకపోతే గతంలో రెండుసార్లు అర్ధ సెంచరీలు చేసిన భువీ ఈ సారెలా ఆడుతాడోనని అభిమానులు ఎదురు చూస్తున్నారు. షమి, కరణ్ శర్మకు రంజీల్లో మిడిలార్డర్ లో బ్యాటింగ్ కు దిగి ఉపయుక్తమైన ఇన్నింగ్స్ ఆడిన అనుభవం ఉంది. ఐపీఎల్ సందర్భంగా బ్యాటింగ్ లో కూడా వీరు అడపాదడపా రాణించిన సందర్భాలు ఉన్నాయి. మరి వీరు ఆసీస్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటారా? లేక విఫలమవుతారా? అని టీమిండియా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వీరి ప్రదర్శనే వరల్డ్ కప్ పై ఆశలా? అడియాసలా? అనేది నిర్ణయించనుందన్నది జగమెరిగిన సత్యం.