: లోక్ సభను మంత్రముగ్ధం చేసిన వెంకయ్యనాయుడు
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు లోక్ సభను మంత్రముగ్ధం చేశారు. మత మార్పిళ్ల అంశంపై ఆయన సమర్ధవంతమైన వాదనను వినిపించారు. భారత దేశాన్ని ప్రపంచం మొత్తం హిందూ దేశమనే పేర్కొంటుందని ఆయన స్పష్టం చేశారు. జాతీయపతాకాం ఆవిష్కరించేప్పుడు, ఓ ప్రముఖ కార్యక్రమం పూర్తి చేసినప్పుడు, దేశ భక్తి రంగిలించేటప్పుడు జైహింద్ అనే అంతా అంటామని ఆయన గుర్తుచేశారు. అంతే కానీ హిందూ అనేది మోదీ పెట్టిన పేరు కాదని ఆయన స్పష్టం చేశారు. దేశంలో ఎవరి మనోభావాలకు అనుగుణంగా వారు మత విశ్వాసాలు అనుసరించవచ్చని ఆయన వివరించారు. అలా అని చెప్పి ఇతర మతాలపై విషబీజాలు నాటడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. లోక్ సభలో అద్భుతంగా మాట్లాడే అసదుద్దీన్ ఓవైసీ సోదరుడు అక్బరుద్దీన్ ఒవైసీ హైదరాబాదులో ఎలా మాట్లాడారో అందరికీ తెలిసిందేనని ఆయన గుర్తు చేశారు. ఎవరి విశ్వాసాలను వారు అనుసరించడంలో తప్పులేదని చెప్పిన ఆయన, ప్రతి ఒక్కరూ తమ భావాలు వ్యక్తం చేయడంలో సంయమనం పాటించాలని సూచించారు. ఇతరుల భావాలను గాయపరిచే స్వేచ్ఛ ఎవరికీ లేదని ఆయన వెల్లడించారు. దేశానికి ఏది మంచి జరుగుతుందో, దేశంలోని ప్రజలు దేనిని విశ్వసిస్తారో, ప్రజలు ఏది కోరుకుంటారో అదే కేంద్ర ప్రభుత్వం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఆర్ఎస్ఎస్ సభ్యుడిగా ఉండడానికి తాను గర్విస్తానని ఆయన అన్నారు. ప్రతిపక్షాలు ఏదైనా మాట్లాడే ముందు వినడానికి ఓపిక ఉండాలని ఆయన హితవు పలికారు. భవిష్యత్ తరాల నేతలు ఉభయ సభల్లో మాట్లాడుతుంటే వారి పరిజ్ఞానానికి, మాటల్లో వారి పరిణతికి మంత్రముగ్ధులమవుతున్నామని ఆయన వెల్లడించారు. ప్రతి ఒక్కరికీ ఓపిక ఉండాలని ఆయన స్పష్టం చేశారు.