: యాకుత్ పురాలో ఆ 55 మంది రక్తం పీల్చే జలగలు
హైదరాబాదులోని యాకుత్ పురాలో వడ్డీ, చక్రవడ్డీ, బారువడ్డీ పేరిట పేదల రక్తమాంసాలను పీల్చే జలగల్లాంటి వడ్డీ వ్యాపారులు 55 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వడ్డీ చెల్లించడం లేదన్న నెపంతో ఇంట్లో వయసుకొచ్చిన మహిళలను, పిల్లలను ఎత్తుకుపోతున్న వడ్డీ వ్యాపారులపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో పోలీసులు సోదాలు నిర్వహించారు. అవసరమున్నా లేకున్నా రుణం ఇస్తామంటూ పేదల ఇళ్లకు వడ్డీ వ్యాపారులు వెళతారు. అవసరం అయితే తమను సంప్రదించమని చెబుతుంటారు. దీంతో అవసరాన్ని బట్టి ఎంతో కొంత అప్పు తీసుకునే పేదల నుంచి 15 లేక 20 రూపాయల లెక్కన వడ్డీ గుంజుతారు. అసలు కంటే వడ్డీ పెరిగిపోవడంతో వారు మరింత ఇబ్బందుల్లోకి వెళ్లిపోతారు. ఇక్కడ్నించి వడ్డీ వ్యాపారి ఆగడాలు పెరిగిపోతాయి. కొంత కాలం ఇంట్లోని సామాన్లు వడ్డీ కింద జమ చేసుకుంటారు. తరువాత ఇంట్లోని ఆడవాళ్లపై పడతారు! వడ్డీ చెల్లించకపోవడంతో వారి ఆగడాలను మౌనంగా భరిస్తారు. భరించలేని పక్షంలోనే పోలీసులను ఆశ్రయిస్తారు. వారి అదృష్టం బాగుండి పోలీసులు తక్షణం స్పందిస్తే కొంత కాలం వేధింపులు ఆగుతాయి. లేని పక్షంలో వేధింపులు మరింత అధికమవుతాయి. దీంతో పేదలు నిరుపేదలుగా మారిపోతున్నారు. వడ్డీ వ్యాపారుల ఆగడాలపై ఫిర్యాదులు లెక్కకు మిక్కిలిగా వస్తుండడంతో పోలీసులు జూలు విదిల్చారు. 55 మందిని కటకటాల వెనక్కి తోసి వారిపై మనీ లెండింగ్ చట్టం కింద, పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేయనున్నారు.