: రుణమాఫీ విషయంలో అసాధ్యాన్ని సుసాధ్యం చేశాం: చంద్రబాబు
ఏపీ రైతుల రుణమాఫీ విషయంలో అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేసి చూపించామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆ విశిష్టత ఒక్క తెలుగుదేశం పార్టీకే చెందుతుందని చెప్పారు. మాఫీ విషయంలో ఇది ఆరంభం మాత్రమేనని, ముందు ముందు రైతులు ఆత్మగౌరవంతో బతికేలా కృషి చేస్తానని సీఎం ప్రకటించారు. చిత్తూరులో ఏర్పాటు చేసిన రైతు సాధికార సదస్సులో పాల్గొన్న బాబు, ఈ సందర్భంగా రైతులకు రుణమాఫీ పత్రాలను అందజేశారు. అనంతరం మాట్లాడుతూ, ఎన్టీఆర్ హయాంలోనే తొలిసారిగా రైతులకు న్యాయం జరిగిందన్నారు. కానీ, కాంగ్రెస్ పాలనలో రైతులను ఆదుకోవాలన్న ఆలోచన కూడా చేయలేదని ఆరోపించారు. ఇచ్చిన మాట తప్పే మనస్తత్వం తనది కాదని చెప్పిన బాబు, రాష్ట్రంలో ఏ రైతూ దిగులు పడటానికి వీల్లేదని భరోసా ఇచ్చారు. పేదలు, వికలాంగులను ఆదుకునేందుకే పింఛన్లు పెంచామని తెలిపారు.