: మూడో రోజు ఆట ముగిసింది... 'తోక'పైనే భారం!


అడిలైడ్ టెస్టులో మూడో రోజు ఆట ముగిసింది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 5 వికెట్లకు 369 పరుగులు చేసింది. అంతకుముందు, ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ ను 517/7 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు కోహ్లీ అండ్ కో ఇంకా 148 పరుగులు వెనకబడి ఉంది. చేతిలో 5 వికెట్లు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మ (33*), వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా (1*) ఉన్నారు. దీంతో, జట్టును ఆదుకునే భారం 'టెయిల్' ఎండర్ల పైనే ఉంది. లోయర్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ కూడా ఉపయుక్తమైన పరుగులు చేస్తే, భారత్ ఈ మ్యాచ్ లో సురక్షితమైన స్థితికి చేరుకుంటుంది. కాగా, మూడో రోజు ఆటలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ చేయడం హైలైట్. జాన్సన్, హ్యారిస్, సిడిల్ ల నిప్పులు చెరిగే బౌలింగ్ ను తట్టుకుని కోహ్లీ సెంచరీతో సత్తా చాటాడు. భారత ఇన్నింగ్స్ ఆరంభంలో ఓపెనర్లు విజయ్ (53), ధావన్ (25) ఫర్వాలేదనుకుంటున్న తరుణంలో హ్యారిస్ తొలి దెబ్బ కొట్టాడు. ధావన్ ను బౌల్డ్ చేశాడు. దీంతో, 30 పరుగుల వద్ద మొదటి వికెట్ పడింది. ఆ తర్వాత వచ్చిన పుజారా (73) తన డిఫెన్స్ టెక్నిక్ తో ఆసీస్ బౌలర్లకు పరీక్ష పెట్టాడు. చివరికి ఆఫ్ స్పిన్నర్ లియాన్ బౌలింగ్ లో బౌల్డయ్యాడు. లియాన్ విసిరిన బంతి సుడులు తిరుగుతూ వచ్చి పుజారా డిఫెన్స్ ను ఛేదించుకుని స్టంప్స్ ను చెదరగొట్టింది. పుజారా కంటే ముందే రెండో వికెట్ రూపంలో ఓపెనర్ విజయ్ వెనుదిరిగాడు. అతని స్థానంలో వచ్చిన కోహ్లీకి తొలి బంతితోనే పరీక్ష పెట్టాడు జాన్సన్. ఈ లెఫ్టార్మ్ పేసర్ విసిరిన బౌన్సర్ కోహ్లీ తలకు తాకింది. అయితే, ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అటుపై క్రీజులో కుదురుకున్న ఈ ఢిల్లీ డైనమైట్ తనదైన శైలిలో షాట్లు కొడుతూ స్కోరు బోర్డును ముందుకు కదిలించాడు. ఇక, పుజారా వెనుదిరిగిన అనంతరం క్రీజులోకి వచ్చిన రహానే (62) అర్థసెంచరీతో సత్తా చాటాడు. కోహ్లీ, రహానే జోడీ నాలుగో వికెట్ కు సెంచరీ భాగస్వామ్యం నమోదు చేసింది. దీంతో, భారత్ 300 మార్కు అధిగమించింది. పుజారాను బలిగొన్న లియాన్ మరోసారి సత్తా చాటుతూ రహానే వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. దీంతో, భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. క్రీజులో అడుగుపెట్టిన రోహిత్ కూడా నిలకడ ప్రదర్శించాడు. అటు, మార్ష్ బౌలింగ్ లో ఫోర్ కొట్టి కోహ్లీ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇన్నింగ్స్ సాఫీగా సాగుతుందనుకుంటున్న తరుణంలో కోహ్లీ... జాన్సన్ విసిరిన బౌన్సర్ కు బలయ్యాడు. బంతి అతని బ్యాట్ ఎడ్జ్ ను ముద్దాడుతూ హ్యారిస్ చేతుల్లో వాలింది. అప్పటికి భారత్ స్కోరు 94.1 ఓవర్లలో 367/5. అనంతరం, రోహిత్, సాహా మరో వికెట్ పడకుండా మూడో రోజు ఆటను ముగించారు. ఆసీస్ బౌలర్లలో జాన్సన్, లియాన్ చెరో రెండు వికెట్లు తీయగా, హ్యారిస్ ఓ వికెట్ సాధించాడు.

  • Loading...

More Telugu News