: మావోల నిరోధం బిల్లుకు కేబినెట్ ఆమోదం లభించేదెన్నడో?
ఓ వైపు మావోయిస్టులు పీఎల్ జీఏ (పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ) వారోత్సవాల పేరిట ఛత్తీస్ గఢ్ అటవీ ప్రాంతంలో రోజుల తరబడి సమావేశాలు నిర్వహించారు. ఇటీవల తమ కార్యకలాపాలు కాస్త తగ్గినా, తాము ఏమాత్రం బలహీనపడలేదని చాటిచెబుతూ ఛత్తీస్ గఢ్ లోని సుకుమా జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై విరుచుకుపడ్డారు. వీరి దుశ్చర్యలను నిలువరించేందుకు ముందుకు దూకుదామంటే పోలీసు బలగాలకు ప్రభుత్వ విధాన నిర్ణయాలు అడ్డు తగులుతున్నాయి. సమగ్ర ప్రణాళికతో మావోలను కూకటివేళ్లతో పెకలించివేద్దామన్న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రతిపాదనలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంలో మొద్దునిద్ర పోతోంది. దాదాపు రెండు నెలల క్రితమే ఈ ముసాయిదా బిల్లు రూపకల్పన పూర్తైనా, దానికి ఆమోద ముద్ర లభించలేదు. ఈ బిల్లు ప్రకారం... ఓ వైపు మావోలపై దాడులు కొనసాగిస్తూనే, మరోవైపు వారికి ప్రజలు మద్దతు పలకకుండా పలు శాఖల కింద సమగ్ర అభివృద్ది పనులు చేపట్టాల్సి ఉంది. ఇందులో హోంశాఖతో పాటు కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్, రహదారులు, ఉపరితల రవాణా, ఆర్థిక, గిరిజన వ్యవహారాలు, పర్యావరణ, అటవీ శాఖల సంయుక్త కార్యాచరణ అవసరం. ఈ శాఖల మధ్య సమన్వయం లేని కారణంగానే ఈ బిల్లుకు కేబినెట్ ఆమోదం లభించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.