: ఉబెర్ వివాదం... రాజ్ నాథ్, నితిన్ ల మధ్య చిచ్చుపెట్టింది!
ఢిల్లీలో మహిళా ఉద్యోగిపై అత్యాచారం నేపథ్యంలో తలెత్తిన ఉబెర్ వివాదం పెద్ద దుమారాన్నే రేపుతోంది. ఇప్పటికే తనకే కాక తన తరహాలో ట్యాక్సీ సేవలు అందిస్తున్న క్యాబ్ సర్వీసుల మెడపై కత్తులు వేలాడేలా చేసిన ఉబెర్ వివాదం... తాజాగా కేంద్ర కేబినెట్ లో కీలక శాఖల బాధ్యతలు నిర్వహిస్తున్న ఇద్దరు కేంద్ర మంత్రుల మధ్య చిచ్చుపెట్టింది. వెబ్ ఆధారిత సేవల క్యాబ్ లపై నిషేధం విధించాలని హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ భావిస్తుంటే, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మాత్రం ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దారుణ ఘటనకు కేంద్ర బిందువుగా నిలిచిన ఉబెర్ క్యాబ్ సేవలను నిలిపేయాలని రాజ్ నాథ్ సింగ్ ఇప్పటికే అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఉబెర్ పై నిషేధం విధించడం ద్వారా సమస్య పరిష్కారం కాదని వాదిస్తున్న నితిన్ గడ్కరీ, రాజ్ నాథ్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.