: కేసీఆర్ వ్యవహారశైలి ఎలా వుందంటే, చనిపోకముందే సమాధి కట్టుకున్నట్టు ఉంది: ఇంద్రసేనారెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విషయంలో అంతా విచిత్రంగా జరుగుతోంది. ఓ వైపు ప్రధాని మోదీ, బీజేపీ అగ్రనేతలతో సఖ్యంగా ఉండేందుకు ఆయన ప్రయత్నిస్తుంటే... మరోవైపు ఆయనపై బీజేపీ నేతలు ఘాటు విమర్శలను ఎక్కు పెడుతున్నారు. తాజాగా కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి సెటైర్లు విసిరారు. వాటర్ గ్రిడ్ పథకం పూర్తి కాకముందే... దానికి సంబంధించిన పైలాన్ ను నిర్మించే పనిలో కేసీఆర్ పడ్డారని విమర్శించారు. తన పదవీ కాలంలో గ్రిడ్ పనులు పూర్తికాకపోతే... వచ్చే పాలకుల పేరు పైలాన్ మీద ఉంటుందనే భావనతోనే ముందు జాగ్రత్త చర్యగా కేసీఆర్ పైలాన్ నిర్మాణానికి పూనుకున్నారని ఆరోపించారు. ఈ ఐదేళ్లలో వాటర్ గ్రిడ్ పూర్తవుతుందన్న నమ్మకం కేసీఆర్ కే లేదని ఎద్దేవా చేశారు. పరిపాలనపై ఏమాత్రం అవగాహన లేని కేసీఆర్ హయాంలో పేదవర్గాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయని అన్నారు.