: దక్షిణ కోస్తాలో స్తంభించిన జనజీవనం
గడచిన 36 గంటలుగా ప్రకాశం, నెల్లూరు జిల్లాల అంతటా, చిత్తూరు, గుంటూరు జిల్లాలలో అక్కడక్కడా పడుతున్న భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. ముఖ్యంగా, ఒంగోలు జిల్లా అతివృష్టితో ఇబ్బందులు పడుతోంది. నగరంలో నేటి ఉదయం నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరింది. జిల్లాలోని పొదిలి, చీమకుర్తి, కందుకూరు, కనిగిరి ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో వర్షానికి తోడు చలిగాలుల తీవ్రత అధికంగా ఉండడంతో వీధుల్లో జనసంచారం మందగించింది. భారీ వర్షాల కారణంగా పలు రైళ్ళు ఆలస్యంగా నడుస్తున్నాయి.