: ఇంధన పొదుపులో హెరిటేజ్ ఫుడ్స్ కు జాతీయ స్థాయి అవార్డు!
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కుటుంబ నేతృత్వంలోని హెరిటేజ్ ఫుడ్స్ ఇంధన పొదుపులో జాతీయ స్థాయి అవార్డును గెలుచుకుంది. 2014 ఏడాదికి సంబంధించి డెయిరీ విభాగంలో తమకు అవార్డు దక్కిందని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి ప్రకటించారు. గతంలోనూ 2008, 2010, 2012లలో హెరిటేజ్ ఈ అవార్డును దక్కించుకుంది. తాజా అవార్డు హెరిటేజ్ కు నాలుగోది కావడం గమనార్హం. హైదరాబాద్ నగర పరిధిలోని ఉప్పల్ లోని హెరిటేజ్ డెయిరీ విభాగంలో అత్యల్ప విద్యుత్ తో అత్యధిక ఉత్పత్తి సాధించినందుకు ఈ అవార్డు దక్కిందని బ్రాహ్మణి పేర్కొన్నారు. కేవలం రూ.38 లక్షలతో ఏర్పాటు చేసిన విద్యుత్ ఆదా పరికరాలతో తమ సంస్థ ఏకంగా రూ.84 లక్షల విలువ చేసే విద్యుత్ ను ఆదా చేసిందని ఆమె వెల్లడించారు. ఈ నెల 14న ఢిల్లీలో నిర్వహించనున్న కార్యక్రమంలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ నుంచి హెరిటేజ్ ప్రతినిధులు ఈ అవార్డును స్వీకరించనున్నారు.