: తూర్పు గోదావరి జిల్లాలో 80 కొత్త ఘాట్లు... ప్రారంభం కానున్న పుష్కర పనులు
గోదావరి పుష్కరాలకు ఈసారి మూడు కోట్ల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్న అధికారులు ప్రస్తుతం ఉన్న స్నానఘట్టాలు సరిపోవని భావిస్తున్నారు. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో 66 ఘాట్లు ఉండగా, వీటికి అదనంగా మరో 80 కొత్త ఘాట్లను నిర్మించాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. గోదావరి పుష్కరాలకు ప్రధానమంత్రి మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులు రానున్న నేపథ్యంలో పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేయడానికి వీలుగా కొత్త వీవీఐపీ ఘాట్‌ను నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. గత పుష్కరాల్లో నిర్మించిన గౌతమ్ ఘాట్‌ను అప్పట్లో వీవీఐపీ ఘాట్‌గా వినియోగించారు. ఇప్పుడు ఆ ఘాట్ చుట్టూ ఆలయాల నిర్మాణం జరిగి భద్రతా ఏర్పాట్లకు అనువుగా లేదు. వీవీఐపీల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేని ప్రాంతంలో కొత్త ఘాట్‌ను నిర్మించాలని అధికారులు భావిస్తున్నారు. 2003 పుష్కరాల్లో రూ.9 కోట్లు ఖర్చు చేసిన దేవాదాయశాఖ ఈసారి రూ.55.78 కోట్లు ఖర్చు చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేసింది. రాజమండ్రి నగరంలో ఉన్న హోటళ్లు, అతిథి గృహాలు సరిపోవన్న ఉద్దేశ్యంతో, ఈసారి ఎవరైనా ముందుకొస్తే పేయింగ్ గెస్ట్‌ల విధానాన్ని ప్రోత్సహించాలని అధికారులు భావిస్తున్నారు. కాగా, గోదావరి పుష్కరాల పనులను ఈనెలాఖరు నాటికి ప్రారంభించనున్నట్లు ఏపీ మంత్రి మాణిక్యాలరావు తెలిపారు.