: వాటర్ గ్రిడ్ ను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుదాం: అధికారులకు కేసీఆర్ పిలుపు
తెలంగాణలో చేపట్టనున్న వాటర్ గ్రిడ్ ను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుదామని సీఎం కేసీఆర్ ఇంజినీరింగ్ అధికారులకు పిలుపునిచ్చారు. బుధవారం సిద్ధిపేట సమగ్ర మంచినీటి పథకంపై తన కేబినెట్ సహచరులకు అవగాహన కల్పించిన సందర్భంగా మాట్లాడిన కేసీఆర్, వాటర్ గ్రిడ్ విజయం అధికారులపైనే ఆధారపడి ఉందని పేర్కొన్నారు. ‘‘17 ఏళ్ల కిందట సిద్ధిపేటలో చేసింది, ఇప్పుడు చేయలేమా?’’అంటూ ఆయన వ్యాఖ్యానించారు. రేయింబవళ్లు కష్టపడి అయినా వాటర్ గ్రిడ్ ను నాలుగేళ్లలో పూర్తి చేయాలని ఆయన అధికారులకు సూచించారు. ‘‘అందరూ అసాధ్యమన్న తెలంగాణ రాష్ట్రాన్ని సుసాధ్యం చేసుకున్నాం. అలాగే ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును విజయవంతం చేసి దేశానికే ఆదర్శంగా నిలుపుదాం. ఇందుకు ప్రతి అధికారి అర్జునుడిలా మారాలి. అధికారులంతా చెమటచుక్కలు రాలిస్తేనే, ప్రజలకు కాసిన్ని మంచినీటి చుక్కలు అందుతాయి’’ అని కేసీఆర్ చెప్పారు. 1997లో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సిద్ధిపేటలో ఏర్పాటు చేసిన సమగ్ర మంచినీటి పథకమే వాటర్ గ్రిడ్ కు మూలమని ఆయన పేర్కొన్నారు.