: ఇక్కడి విక్రయాలకు ఇక్కడే పన్ను కట్టాలి: ఈ-టెయిలింగ్ సంస్థలకు తెలంగాణ సర్కారు ఆదేశం


రాష్ట్ర విభజన నేపథ్యంలో క్రమంగా తగ్గుతున్న పన్ను వసూళ్లపై తెలంగాణ సర్కారు అంతర్మథనంలో కూరుకుపోయింది. మొన్నటికిమొన్న చమురు సంస్థలు సీమాంధ్రలో పన్నులు కడుతున్న వైనంపై కేంద్రానికి ఫిర్యాదు చేసిన తెలంగాణ ప్రభుత్వం, తాజాగా ఆన్ లైన్ లలో విక్రయాలు సాగిస్తున్న ఈ-టెయిలింగ్ సంస్థలపై దృష్టి సారించింది. తెలంగాణ పరిధిలో జరిపే విక్రయాలకు సంబంధించిన పన్నును తమకే చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇటీవలి కాలంలో ఆన్ లైన్ విక్రయాలు పెరిగిన నేపథ్యంలో రిటెయిల్ విక్రయాలు భారీగా పడిపోయాయి. ఈ ప్రభావం తెలంగాణ పరిధిలోని హైదరాబాద్ లో గణనీయంగా పెరుగుతోంది. రిటెయిల్ విక్రయాలు పడిపోయిన నేపథ్యంలో వ్యాట్ పన్ను వసూళ్లు భారీగా తగ్గిపోయాయి. దీంతో తెలంగాణ పన్నుల రాబడి కూడా గణనీయంగా తగ్గింది. తగ్గుతున్న పన్ను రాబడులను రాబట్టేందుకు రంగంలోకి దిగిన ప్రభుత్వం తక్షణ చర్యలను చేపట్టింది. ఎక్కడో బెంగళూరు, ముంబై, ఢిల్లీలో కూర్చుని ఇక్కడి వినియోగదారుల నుంచి ఆర్డర్లు తీసుకుని కొరియర్ సేవల ద్వారా వస్తువులను చేరవేస్తున్న ఈ-టెయిలింగ్ సంస్థలు పన్నులను మాత్రం అక్కడే కడుతున్నాయి. ఇకపై ఈ తరహా వ్యవహారం చెల్లదని చెబుతూ, తమ ప్రాంత పరిధిలో విక్రయమవుతున్న వస్తువులకు సంబంధించిన పన్నును తమకే చెల్లించాలని కేసీఆర్ సర్కారు వాదిస్తోంది. ఈ విషయంలో తన ఆదేశాలు పాటించని ఈ-టెయిలింగ్ సంస్థల కార్యకపాలను నిషేధించేందుకు వెనుకాడేది లేదని ప్రభుత్వ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

  • Loading...

More Telugu News