: గాంధీ చెప్పింది మన పిల్లల నుంచే ప్రారంభిద్దాం: సత్యార్థి
ప్రపంచానికి శాంతి నేర్పించండి అంటూ మహాత్మాగాంధీ చెప్పినట్టు మన పిల్లలకు శాంతి గురించి నేర్పిద్దాం అని నోబెల్ పురస్కార గ్రహీత కైలాష్ సత్యార్థి పిలుపునిచ్చారు. నార్వేలోని ఓస్లోలో ఆయన మాట్లాడుతూ, బాలల హక్కుల కోసం పోరాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. పిల్లలు దేవుడితో సమానమని, వారిలో తేడాలు చూడలేమని, పిల్లాడేడిస్తే అంతా ఒకేలా స్పందిస్తామని అలాంటప్పుడు మన పిల్లల కోసం మనం పోరాడలేమా? అని ఆయన స్పూర్తిని రగిలించారు. బాల కార్మిక వ్యవస్థ, బాలల ట్రాఫికింగ్, బాలలకు అందని విద్య, బాలలపై అఘాయిత్యాలు, బాలలపై దాడులను రద్దు చేసేలా పోరాడాలని ఆయన స్పష్టం చేశారు. ప్రతి పిల్లకు స్వేచ్ఛ ఉండాలని ఆయన సూచించారు. నేటి నుంచి బాలల అంశంపై ప్రపంచం సొంత జెండాలు, అజెండాలు వదలాలని, అంతా కలిసి నడవాలని ఆయన ఆకాంక్షించారు. వేల కొద్దీ మహాత్మా గాంధీలు, నెల్సన్ మండేలాలను తయారు చేసేందుకు బానిస సంకెళ్ల నుంచి, బాలకార్మిక వ్యవస్థ నుంచి బాలల హక్కుల హరించి వేత నుంచి వారికి స్వేచ్ఛ కల్పిద్దామని ఆయన పిలుపునిచ్చారు. ఆయన ప్రసంగం ముగించిన చాలా సేపటి వరకు కరతాళ ధ్వనులు మార్మోగుతూనే ఉన్నాయి. ఈ సందర్భంగా అంజాద్ అలీ ఖాన్ సరోద్ కచేరీ అద్భుత ఆదరణ పొందింది.