: ప్రపంచంలోనే అతి చిన్న బైబిల్... చదవాలంటే మైక్రోస్కోపు ఉండాల్సిందే!
ప్రపంచంలో అత్యంత చిన్నదైన బైబిల్ ను నానో బైబిల్ కంపెనీ రూపొందించింది. ఈ బైబిల్ సైజు (4.76 మిమీ) సెంటీమీటర్ లో సగం కంటే తక్కువేనట. ఈ బైబిల్ ను జెరూసలెంలో ఉన్న నానో బైబిల్ కంపెనీవారు సిలికాన్ నానో చిప్ తో తయారు చేశారు. ఈ బైబిల్ లో గ్రీకు వెర్షన్ న్యూ టెస్ట్ మెంట్ (కొత్త నిబంధన) లోని 27 భాగాలను ముద్రించారు. ఈ బైబిల్ లో ఒక్కో అక్షరం 0.18 మైక్రాన్లు అంటే ఒక మీటర్ లో 1.80 కోట్ల వంతు సూక్ష్మంగా ఉంటుందని రూపకర్తలు తెలిపారు. అందుకే ఈ బైబిల్ ను మైక్రోస్కోపు కింద పెట్టి చదువుకోవాల్సిందే. ఈ నానో బైబిల్ ను లాకెట్ లోనూ, గడియారంలోనూ, ఇతర ఆభరణాల్లో అమర్చుకోవచ్చని సదరు సంస్థ తెలిపింది. ప్రస్తుతానికి అత్యంత చిన్న బైబిల్ రికార్డు భారతీయుడి పేరిటే ఉంది. దీన్ని నానో బైబిల్ అధిగమించడం ఖాయమని అంటున్నారు. ఈ నానో బైబిల్ ఇంకా చిన్నదని, దీనిని రికార్డు పుస్తకాల్లో నమోదు చేయిస్తే గిన్నిస్ రికార్డు ఖాయమని, దరఖాస్తు చేసుకోవడమే ఆలస్యం అని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాగా, ప్రపంచంలోనే అత్యంత చిన్న పుస్తకం రికార్డు 'టినీ టెడ్ ఫ్రమ్ టర్నిప్ టౌన్' అనే 30 పేజీల కథల పుస్తకం పేరిటే భద్రంగా ఉంది.