: క్రీడా లీగ్ లు ప్రతిభకు అవకాశం కల్పిస్తున్నాయి: అమితాబ్ బచ్చన్
దేశీయ క్రీడా రంగాల్లో పుట్టుకొస్తున్న లీగ్ లపై బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ హర్షం వ్యక్తం చేశారు. పూర్తి స్థాయిలో ప్రతిభను కనబరిచేందుకు లీగ్ లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు. 72 ఏళ్ల ఈ నటుడు ఇటీవల ఢిల్లీలో ఐపీటీఎల్ ఆటగాళ్లను కలిశాడు. ఈ నేపథ్యంలో తన ఆలోచనలను ట్విట్టర్ లో పంచుకున్నాడు. ఇటువంటి ఆటల కార్యక్రమాలు జాతీయ సమగ్రతకు దోహదం చేస్తున్నాయని చెప్పాడు. "దేశవ్యాప్తంగా క్రీడా లీగ్ లు అద్భుతమైన ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయి. ఈ స్థాయిలో క్రీడా పోటీల నిర్వహణను ఎప్పుడూ చూడలేదు! ఈ లీగులన్నీ ప్రతిభ నిరూపించుకునేందుకు ఓ అవకాశాన్ని కల్పిస్తున్నాయి. దేశంలో అందరి మధ్య సమన్వయాన్ని తీసుకొస్తున్నాయి" అని బచ్చన్ ట్విట్టర్ లో పోస్టు చేశాడు. కాగా, చదువుకు తొలి ప్రాధాన్యత ఇచ్చే రోజులు పోయాయంటున్నాడు. తమ కాలంలో చదువు ముందు, ఆటలు తరువాత అనేవారని, ప్రస్తుత కాలంలో ఆటలే ముందంటూ, తరువాతే చదువు విషయానికి వస్తున్నారని పేర్కొన్నాడు.