: ముంబైలో ఫ్లాట్ల కోసం తొమ్మిది రోజుల్లో 500 కోట్లు చెల్లించారు!
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో గజం స్థలం కావాలంటే కోట్లు చెల్లించాల్సిందే. పగలు, రాత్రికి అన్న తేడా లేకుండా జన సమ్మర్ధం కొనసాగే ముంబైలో నివాసం ఉండడం ఉత్తరాదిలోని సగం మంది కల. ఉద్యోగం, సినిమాలు, ఆర్థికావకాశాలు అంటూ దేశంలోని సగం రాష్ట్రాల నుంచి ముంబైకి చేరే వలస పక్షుల సంఖ్య చాలా ఎక్కువ. దీంతో, అక్కడ రియల్ ఎస్టేట్ కు భలే గిరాకీ పలుకుతోంది. దీంతో ప్రముఖ రియాల్టీ సంస్థ లోథా గ్రూప్ తొమ్మిది రోజుల్లో 500 కోట్లు విలువ చేసే ప్లాట్లు అమ్మింది. దక్షిణ మధ్య ముంబైలో 'వరల్డ్ వన్ టవర్' పేరిట 117 అంతస్తుల భవంతి నిర్మాణాన్ని లోథా గ్రూప్ 2010లో ప్రారంభించింది. ఇది 2016 నాటికి పూర్తి అవుతుంది. ఈ నేపథ్యంలో, ఈ టవర్ లో ఫ్లాట్ల అమ్మకాలు ప్రారంభించింది. దీనికి ముంబైకర్ల నుంచి అనూహ్యమైన ఆదరణ వచ్చిందని లోథా గ్రూప్ తెలిపింది. తాజాగా, బుకింగ్స్ ప్రారంభించగా రికార్డు స్థాయి ఓపెనింగ్స్ వచ్చాయని లోథా గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ అభిషేక్ లోథా తెలిపారు. కేవలం తొమ్మిది రోజుల్లోనే 500 కోట్ల రూపాయలు చెల్లించి ఫ్లాట్లు బుక్ చేసుకున్నారని ఆయన చెప్పారు. 'వరల్డ్ వన్ టవర్' లో 75 శాతం సివిల్ నిర్మాణం పూర్తైందని ఆయన వివరించారు. అయితే ఇక్కడ ఫ్లాట్ ఎంత? ఎంత మంది ఫ్లాట్లు బుక్ చేసుకున్నారు? ఫ్లాట్ బుక్ చేసుకునేందుకు నిబంధనలు ఏంటి? అనే విషయాలను మాత్రం ఆయన వెల్లడించకపోవడం విశేషం.