: ముగిసిన రాజపక్స తిరుమల పర్యటన... తమిళ మీడియా ప్రతినిధుల అరెస్ట్
శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజపక్స తిరుమల పర్యటన ఉద్రిక్తతల నడుమ ముగిసింది. ఆయన ముందు నిరసన తెలుపుతారన్న ఉద్దేశంతో తిరుమలలోని తమిళ పత్రికా ప్రతినిధులను పోలీసులు అరెస్ట్ చేయడం చర్చనీయాంశం అయింది. కాగా, బుధవారం తెల్లవారుజామున వైకుంఠం క్యూకాంప్లెక్స్ నుంచి మహాద్వారం చేరుకున్న రాజపక్స శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన తిరుగు ప్రయాణం సందర్భంగా తిరుపతి ప్రధాన రహదారుల్లో అడుగడుగునా పోలీసులు మోహరించారు. తిరుపతి నుంచి రేణిగుంట వరకూ రోడ్లపై సాధారణ ప్రజలను కూడా అనుమతించలేదు. పోలీసుల చర్యలతో భక్తులు ఇబ్బంది పడ్డారు. ఉదయం 7:30 గంటల సమయంలో తిరుపతికి బయలుదేరిన ఆయన రేణిగుంట విమానాశ్రయానికి చేరి కొలంబోకు బయలుదేరడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.