: ప్రకాశం జడ్పీ ఛైర్మన్ కు హైకోర్టు షాక్... తుది తీర్పు దాకా వైస్ చైర్మన్ కే పీఠం!
ప్రకాశం జిల్లా పరిషత్ ఛైర్మన్ ఈదర హరిబాబుకు హైకోర్టు ఝలకిచ్చింది. తుది తీర్పు వెలువడే దాకా జిల్లా పరిషత్ వైస్ ఛైర్మన్ నే ఛైర్మన్ గా కొనసాగించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు హైకోర్టు కొద్దిసేపటి క్రితం మధ్యంతర ఉత్వర్వులిచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ టికెట్ పై పోటీ చేసిన ఈదర హరిబాబు జడ్పీటీసీగా విజయం సాధించారు. అనంతరం జడ్పీ ఛైర్మన్ పదవిని దక్కించుకునేందుకు వైకాపా వైపు వెళ్లారు. దీంతో ఈదరను అనర్హుడిగా ప్రకటించాలని టీడీపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ వివాదంపై హైకోర్టుకెళ్లిన ఈదర తనకు అనుకూలంగా తీర్పు తెచ్చుకున్నారు. అయితే తిరిగి ఈ విషయంలో దాఖలైన పిటిషన్ నేపథ్యంలో హైకోర్టు ఈదరకు షాకిచ్చింది. ఈదర వాదనపై మూడు నెలల్లో విచారణ ముగించాలని ప్రకాశం జిల్లా కోర్టుకు హైకోర్టు సూచించింది.