: ఈ గుడిలో విగ్రహం ఉండదు!
తమిళనాడులోని చిదంబరంలో ఉన్న థిల్లై నటరాజ దేవాలయానికి ఓ ప్రత్యేకత ఉంది. పరమేశ్వరుడి పేరిట నిర్మితమైన ఈ ఆలయ గర్భగుడిలో విగ్రహమేదీ కనిపించదు. ఓ తెర మాత్రం దర్శనమిస్తుంది. అవతల అంతా ఖాళీగానే ఉంటుంది. అందుకు కారణం ఉంది. శివుడికి పంచభూతాల పేరిట ఆలయాలున్నాయి. అగ్ని, భూమి, వాయువు, నీరు, ఆకాశం... ఇలాగన్నమాట. చిదంబరంలో ఉన్నది ఆకాశలింగ దేవాలయం. అందుకే, ఇక్కడ విగ్రహం ఏమీ ఉండదు. ఆకాశంలో ఎలా శూన్యం ఆవరించి ఉంటుందో, ఇక్కడా అదే వాతావరణం గోచరిస్తుంది. కార్తీక మాసంలోనే కాకుండా, అన్ని కాలాల్లోనూ భక్తులు ఈ ఆలయానికి విశేషంగా తరలివస్తారట.