: పోలీసుల కళ్లల్లో కారంకొట్టి, మావోయిస్టు ఖైదీల పరార్...కాల్పుల్లో ఐదుగురు ఖైదీల మృతి


అప్పుడే కోర్టులో హాజరుపరచి జైలు వద్దకు తీసుకొచ్చిన ఖైదీల నుంచి జార్ఖండ్ పోలీసులు ఊహించని విధంగా దాడిని ఎదుర్కోవాల్సి వచ్చింది. దాడి నుంచి తేరుకున్న పోలీసులు కాల్పులకు దిగారు. మంగళవారం చైబాసా జైలు మెయిన్ గేటు వద్ద చోటుచేసుకున్న ఈ ఘటనలో ఐదుగురు మావోయిస్టు ఖైదీలు మరణించగా, 12 మంది ఖైదీలు పరారయ్యారు. వివరాల్లోకి వెళితే... జార్ఖండ్ లోని సింగ్ భం జిల్లా కోర్టులో హాజరుపరచిన 50 మంది మావోయిస్టు ఖైదీలను పోలీసులు చైబాసా జైలుకు తరలించారు. ఎలాంటి ఇబ్బంది లేకుండానే జైలు ప్రధాన ద్వారం వద్దకు పోలీసుల వ్యాను చేరుకుంది. అయితే ప్రధాన ద్వారం పరిసరాల్లో జరుగుతున్న సంతను ఖైదీలు అవకాశంగా మలచుకున్నారు. గేటు ముందు వ్యానులో నుంచి దిగిన ఖైదీలు ఒక్కసారిగా పోలీసుల కళ్లల్లో కారం చల్లారు. వెనువెంటనే అక్కడి నుంచి తప్పించుకునేందుకు యత్నించారు. ఊహించని పరిణామంతో క్షణాల్లో తేరుకున్న పోలీసులు కాల్పులు ప్రారంభించారు. ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టు ఖైదీలు చనిపోయారు. అయితే ఓ 12 మంది ఖైదీలు మాత్రం పోలీసుల నుంచి తప్పించుకున్నారు. పరారైన ఖైదీల కోసం పోలీసులు వేట సాగిస్తున్నారు.

  • Loading...

More Telugu News