: చనిపోయిందనుకున్న శిశువుకు ఆ వైద్యుడు జీవం పోశాడు!


నెల క్రితం జన్మించిన తమ పాప స్పృహ కోల్పోవడంతో చనిపోయిందని భావించిన ఆ దంపతులు తీవ్ర శోకంలో మునిగిపోయారు. పాప అంత్యక్రియల కోసం ఏర్పాట్లూ చేశారు. అయితే అటుగా వచ్చిన సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రి చిన్న పిల్లల వైద్యుడు రహీం ఆ దంపతుల్లో తిరిగి ఆనందం నింపారు. నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన కాస్త ఆలస్యంగా మంగళవారం వెలుగు చూసింది. మెదక్ జిల్లా హత్నూర మండలం లింగాపూర్ కు చెందిన సాత్విక, రాజు దంపతులకు నలభై రోజుల క్రితం ఓ ఆడ శిశువు జన్మించింది. అయితే నాలుగు రోజుల క్రితం పాలు తాగడం మానేసిన పసిపాప అపస్మారక స్థితికి చేరుకుంది. దీంతో పాప చనిపోయిందని భావించిన ఆ దంపతులు ఈ నెల 6న పాప అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. అయితే అదే సమయంలో గ్రామానికి వచ్చిన వైద్యుడు రహీం పాపను పరిశీలించి, పాప చనిపోలేదని నిర్ధారించాడు. వెంటనే సంగారెడ్డిలోని జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలోని శిశు సంజీవని విభాగంలో చేర్పించి రిస్కీ ట్రీట్ మెంట్ ద్వారా పాపను తిరిగి స్పృహలోకి తీసుకొచ్చారు. మరింత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని నీలోఫర్ చిన్న పిల్లల ఆస్పత్రికి పాపను తరలించారు. చనిపోయిందనుకున్న తమ పాప తిరిగి స్పృహలోకి రావడంతో ఆ దంపతులు సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోయారు.

  • Loading...

More Telugu News