: తిరుమలలో రాజపక్సకు నిరసన సెగ...60 మంది తమిళుల అరెస్ట్
శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజపక్సకు కొద్దిసేపటి క్రితం తిరుమలలో తమిళుల నిరసనలు ఎదురయ్యాయి. శ్రీవారిని దర్శించుకుని వస్తున్న రాజపక్సను అడ్డుకునేందుకు మాటువేసిన ఎండీఎంకే నేత వైగో మద్దతుదారులతో పాటు పలు తమిళ మీడియా సంస్థలకు చెందిన ప్రతినిధులు ఒక్కసారిగా రోడ్డు మీదకు వచ్చారు. తిరుమలలోని లేపాక్షి సర్కిల్ వద్ద నిరసన తెలిపేందుకు వచ్చిన 60 మంది తమిళులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో 15 మంది దాకా మీడియా ప్రతినిధులున్నారు. ఊహించని ఈ ఘటనతో తిరుమలలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమిళుల నిరసనల నేపథ్యంలో ఇప్పటికే తిరుమల సహా తిరుపతి, చిత్తూరు జిల్లా సరిహద్దులోని తమిళనాడు చెక్ పోస్టుల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినా వైగో మద్దతుదారులు పోలీసుల కళ్లుగప్పి తిరుమల చేరుకున్నారు. తమ నేత వైగో ప్రకటనకు అనుగుణంగా వారు రాజపక్సకు నిరసన తెలియజేశారు.