: స్నోడెర్న్ రష్యా చేరడం వెనుక ఇంత కథ నడిచింది: కేజీబీ మాజీ ఏజెంట్
అమెరికా ప్రపంచ దేశాలపై గూఢచర్యం చేస్తోందంటూ ఆ దేశం సేకరిస్తున్న రహస్య సమాచారం గుట్టువిప్పి గడగడలాడించిన ఎడ్వర్డ్ స్నోడెర్న్ రష్యా చేరడం వెనుక పెద్ద కథే నడిచిందని రష్యా మాజీ సీక్రెట్ ఏజెంట్ తెలిపారు. స్నోడెర్న్ ను బుట్టలో వేసుకునేందుకు రష్యా ఓ మహిళా గూఢచారిని ప్రయోగించిందని రష్యా గూఢచారి సంస్థ కేజీబీ మాజీ ఏజెంట్ బొరిస్ కార్పిచ్ కోవ్ తెలిపారు. తమ బద్ధశత్రువు అమెరికాను వణించిన స్నోడెర్న్ ను తమకు అనుకూలంగా మలచుకునేందుకు అన్నా చాప్ మాన్ (32) అనే 'వేగు' చుక్కను రష్యా రంగంలోకి దించిందని ఆయన పేర్కొన్నారు. ఉన్నతాధికారుల ఆదేశం మేరకు రంగంలోకి దిగిన చాప్ మాన్ తన సోయగాలతో స్నోడెర్న్ కు వలవేసిందని ఆయన పేర్కొన్నారు. స్నోడెర్న్ ను ఒకేసారి కలిసినప్పటికీ 'స్నోడెర్న్... నన్ను పెళ్లి చేసుకుంటావా?' అంటూ ట్విట్టర్ లో చాప్ మాన్ కోరిందని ఆయన తెలిపారు. ఈ కథంతా పథకం ప్రకారం జరిగిందని, స్నోడెర్న్ అందుకు అంగీకరించి ఉంటే రష్యా పౌరసత్వం తీసుకునేందుకు స్నోడెర్న్ అర్హుడవుతాడని ఆయన వెల్లడించారు. అలా జరిగి ఉంటే స్నోడెర్న్ శాశ్వతంగా రష్యాలో ఉండిపోవాల్సి రావచ్చని ఆయన అన్నారు. ఆ తరువాత ఆయన విదేశాలకు వెళ్లాలనుకుంటే రష్యా ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సి వుండేదని ఆయన వివరించారు. ఆ తరువాత స్నోడెర్న్ కు చేసిన పెళ్లి ప్రతిపాదనపై మాట్లాడేందుకు చాప్ మాన్ నిరాకరించింది. కాగా చాప్ మాన్ రష్యా దౌత్యవేత్త పుత్రిక. రష్యా ఏజెంటుగా ఆమె బయటి ప్రపంచానికి తెలియక ముందు ఆమె న్యూయార్క్ లో రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా పని చేసింది. అమెరికా నుంచి రష్యా చేరుకున్న అనంతరం చాప్ మాన్ మోడల్ గా పని చేసింది. అనంతర పరిణామాల్లో స్నోడెర్న్ అమెరికా నుంచి రష్యా చేరుకున్న సంగతి తెలిసిందే.