: కేన్సర్ రోగులకి శుభవార్త...ప్రాణాంతక వ్యాధికి ఇలా చెక్ చెప్పవచ్చు
కేన్సర్ కు కీమోథెరపీ లేదంటే శస్త్ర చికిత్సలు చేయాల్సిందే. కీమోథెరపీ, శస్త్రచికిత్సల వల్ల రోగకారక కణాలతో పాటు ఆరోగ్యకరమైన కణాలు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇకపై అలాంటి బాధ ఉండదని, కేన్సర్ కోసం సరైన మందు కనుక్కున్నామని అమెరికాలోని మెమోరియల్ స్లోన్ కెట్టరింగ్ కేన్సర్ సెంటర్ పరిశోధకులు వెల్లడించారు. దీనికి ఏజీ-221 అని నామకరణం చేశారు. కేన్సర్ రోగుల్లో ఐడీహెచ్ 2 అనే ఉత్పరివర్తన జన్యువు ఉంటుందని, అది 2-హైడ్రాక్సీగ్లుటరేట్ అనే ప్రోటీన్ ను ఉత్పత్తి చేస్తుందని మెమోరియల్ స్లోన్ కెట్టరిగ్ కేన్సర్ సెంటర్ ఆంకాలజిస్టు ఐటన్ ఎం. స్టీన్ తెలిపారు. ఆ ప్రోటీన్ తెల్ల రక్తకణాల అభివృద్ధిని అడ్డుకుంటుందని ఆయన చెప్పారు. అలా అడ్డుకునే ప్రోటీన్ ను నిరోధించి తెల్లరక్తకణాల సాధారణ అభివృద్ధికి ఏజీ-221 దోహదపడుతుందని ఆయన వివరించారు. ఏజీ-221ను 45 మంది రోగులపై ప్రయోగించగా 58 శాతం మెరుగైన ఫలితాలు వచ్చాయని ఆయన తెలిపారు. కీమోథెరపీ, శస్త్రచికిత్స ద్వారా కేన్సర్ కణాల వృద్ధిని నిరోధించే బదులు కేన్సర్ కి కారణమయ్యే జన్యువును ఏజీ-221 నిరోధిస్తుంది కనుక కేన్సర్ రోగులకు ఇదో దివ్యౌషధమని ఆయన అభిప్రాయపడ్డారు.