: 'బిగ్ బాస్' తరహా రియాలిటీ షోలపై రాజ్యసభలో వ్యతిరేకత
'బిగ్ బాస్' వంటి పలు రియాలిటీ టీవీ షోల కంటెంట్ విషయంలో రాజ్యసభలో ఈరోజు విమర్శలు వెల్లువెత్తాయి. కొంతమంది సభ్యులైతే అటువంటి కార్యక్రమాలు 'అసభ్యం'గా, 'అమర్యాదకరం'గా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్నిసార్లు అమ్మాయిలు కొద్దిపాటి దుస్తులతో నృత్యం చేస్తున్న కార్యక్రమాలు కూడా ప్రసారమవుతున్నాయన్నారు. వెంటనే ఇందుకు సభలో కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయమంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ స్పందిస్తూ, అలాంటి కార్యక్రమాలు ఛానళ్లలో వస్తున్నప్పుడు ఫిర్యాదు చేసేందుకు ఓ టెలిఫోన్ నంబర్ డిస్ ప్లే అవుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఏదైనా ఉల్లంఘన ఉంటే తప్పకుండా సదరు వ్యక్తులపై చర్యలు తీసుకుంటామన్నారు. కేవలం వీక్షకుల ఫిర్యాదు ఆధారంగానే కాకుండా, తమ పరిశీలన అనంతరం చర్యలుంటాయన్నారు. ఫిర్యాదులను పరిశీలించేందుకు శాఖకు సొంతంగా ఓ సెల్ ఉందని వివరించారు. ప్రతి ఏడాది వేల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఛానళ్ల కార్యక్రమాలపై పర్యవేక్షణలో భాగంగా, ఎలక్ట్రానిక్ మీడియా మానిటరింగ్ సెంటర్ 1500 టీవీ చానల్స్ ను ఏకకాలంలో మానిటర్ చేస్తోందని సభకు వివరించారు.